పోలీస్ పహారాలో ఆదిలాబాద్ .. !
ఆదివాసీలు, లంబాడీల మధ్య వైరం రోజురోజుకు పెరుగుతోంది. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలంటూ ఆదివాసీలు చేపట్టిన ఉద్యమం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఒకరినొకరు దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యుద్ద వాతావరణం నెలకొంది. ఆదివాసీ-లంబాడీల ఘర్షణల నేపథ్యంలో ఏజెన్సీ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాల మోహరించాయి. పోలీసులు ఎప్పటికప్పుడు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఏజెన్సీ లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఐదుగురు చనిపోయారంటూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎస్పీ శ్రీనివాస్ అన్నారు.
చనిపోయారని చెబుతున్న వారిలో ఫారూఖ్, జితేందర్ అనే వ్యక్తులు రోడ్డు ప్రమాదం లోనే మరణించారని ఆయన స్పష్టం చేశారు. పుకార్లు లేపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వదంతులను ఎవరూ నమ్మొద్దని, పరిస్థితి అదుపులోకి వచ్చిందని కలెక్టర్ చెప్పారు. మొత్తంమీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు.