ఎన్డీయేలో చేరబోతున్న వైకాపా ?

ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్ బుధవారం సమావేశమైన సంగతి తెలిసిందే. వీరి సమావేశం సుదీర్ఘంగా గంటన్నర పాటు సాగింది. మొదట ఎంపీలతో కలిసి ప్రధానితో మాట్లాడిన సీఎం జగన్.. ఆ తర్వాత ఏకాంతంగా ప్రధానితో చర్చలు జరిపారు. దాదాపు అరగంట పాటు ప్రధాని మోడీ-సీఎం జగన్ ల మధ్య ఏకాంత చర్చలు జరిగాయి. 

ఈ అరగంటలో వీరిద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటీ అంటే.. ? ఎన్డీయేలో వైకాపా చేరే ప్రపోజల్ పై చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్రంలో భాజాపాకు సంపూర్ణ మద్దతు ఉంది. లోక్ సభలో భాజాపాకు ఎదురేలేదు. కానీ, రాజ్యసభలో భాజాపాకి స్పష్టమైన మెజారిటీ లేదు. భాజాపాకి బాగా దోస్తానా పార్టీ అయిన శివసేన కూడా ఎన్డీయేకు దూరమైంది. అంతేకాదు.. భాజాపా ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో.. రాజ్యసభలో ఆ పార్టీ సంఖ్య పెరిగే అవకాశాలు కనిపించడం లేదు.
 
అందుకే.. వైకాపాని ఎన్డీయేలోకి ఆహ్వానించారని తెలుస్తోంది. స్వయంగా ప్రధాని మోడీ అడగటంతో సీఎం జగన్ కాదనలేకపోయాడట. అదే సమయంలో భాజాపాతో జతకట్టడం వలన ఏపీలో కలిగే ఇబ్బందులని ఏకరువుపెట్టినట్టు సమాచారమ్. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. ఎన్ డీయేలో చేరడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది కుదరకున్నా.. పోలవరం, ఆర్థికలోటు పూడ్చే విధంగా స్పెషల్ ప్యాకేజీ ఇచ్చినా ఒకే అన్నట్టు సీఎం జగన్ కోరినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఏపీలో జనసేనతో కలిసి నడవాలని భాజాపా నిర్ణయించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు జనసేన-భాజాపాలు కలిసి పనిచేస్తాయని ప్రకటించారు. జనసేనతో పొత్తుకూడిన రాజ్యసభలో అవసరాల దృష్ట్యా వైకాపాని పక్కనపెట్టలేని పరిస్థితి భాజాపాది. మరీ.. వైకాపా ఎన్ డీయే లో చేరుతుందా ? లేక బయటి నుంచే భాజాపాకు మద్దతునిస్తుందా ? అనేది చూడాలి.