సహకారం ఎవరికి ?
ఇటీవలే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల హీట్ తగ్గకముందే సహకార ఎన్నికలొచ్చాయ్. ఈరోజు ‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల'(ప్యాక్స్) ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1గంట వరకూ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెల్లడికానున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 909 సహకార సంఘాలు ఉన్నాయి. అయితే వీటిలో 4 సహకార సంఘాల పదవికాలం ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో 905 సంఘాలకి ఎన్నికలకి గానూ నోటీఫికేషన్ విడుదలైంది. వీటిలో 157 సంఘాల్లో ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన సహకార సంఘాలకి ఈరోజు పోలింగ్ జరుగుతోంది.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధించింది. ఈ జోష్ లోనే సహకార ఎన్నికలకి వెళ్లాలని సీఎం కేసీఆర్ భావించారు. దానికి ఏర్పాట్లు చేయమని అధికారులకి ఆదేశించారు. దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగిసి నెలరోజులు దాటక ముందే సహకార సంఘాల ఎన్నికలు వచ్చాయ్. ఈ ఎన్నికల్లోనూ తెరాస క్లీన్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఫించన్లు, రైతుబంధు, రైతుభీమా పథకాలే తెరాసకు అండాదండా. రైతులు ఏ పార్టీ సైడ్ ఉన్నారని తేల్చే ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధిస్తే.. రైతులు తెరాసవైపు, కేసీఆర్ వైపు ఉన్నారని భావించవచ్చు.