పట్టణ ప్రణాళిక కార్యచరణ ఖరారు

మున్సిపాలిటీ అంటే మురికి, చెత్తకు పర్యాయపదంగా మారింది. అవినీతికి మారు పేరైంది. ఈ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శక విధానాలు అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు జరిగింది. ఇందులో పట్టణ ప్రగతి నిర్వహణకు సంబంధించిన విధివిధానాలతో పాటు కార్యాచరణను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు.

ఈ నెల 24 నుంచి పట్టణ ప్రగతిని ప్రారంభించనున్నారు. 10 రోజుల పాటు పట్టణ ప్రగతిని చేపట్టనున్నారు. ఈ 10రోజుల్లో ఏం చేయాలనే విషయమై సీఎం కేసీఆర్  అవగాహన కల్పించారు. మున్సిపాల్టీల్లో అన్ని హంగులు ఉన్నాయా.. లేదా? నర్సరీలు ఇంకా ఎన్ని అవసరం? చెత్తసేకరణకు ఎన్ని వాహనాలు ఉన్నాయి? ఇంకా ఎన్ని కావాలి? ఇళ్లల్లో తడి, పొడి చెత్తబుట్టలు ఉన్నాయా.. లేదా? తదితర అంశాలతో పాటు పట్టణ ప్రగతికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను రూపొందించారు.
 
వాస్తవ పరిస్థితులకనుగుణంగా వెళ్లాలి తప్ప అతిగా ఊహించుకోవద్దని సూచించారు. పక్కా ప్రణాళిక రూపొందించి అవగాహనతో పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం కేసీఆర్‌ సమావేశం అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం గజ్వేల్‌కు బయల్దేరింది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక బస్సుల్లో పయనమయ్యారు. గజ్వేల్‌లో మార్కెట్లు, శ్మశానవాటికలను ఈ బృందం పరిశీలించనుంది.