డేంజర్ : మళ్లీ స్వైన్ ఫ్లూ వీరంగం

కరోనా వైరస్ తో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయ్. కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రులో చేరిన వారికి స్వైన్ ఫ్లూ అని తేలడం షాక్ కి గురి చేస్తోంది. కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా లక్షణాలతో వస్తున్న వారికి స్వైన్ ఫ్లూ అని తేలుతోంది. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో 23 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.

జ్వరం, దగ్గు, శ్వాస కోశ సమస్యలతో కరోనా వైరస్‌ అనుమానంతో ఆసుపత్రులకు వెళ్తున్నవారికి పరీక్షలు నిర్వహిస్తే స్వైన్‌ఫ్లూ బయటపడుతుంది. చలికాలంలోనే స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతుంటాయి. అయితే, సీజన్ కానీ సీజన్ లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తుండటం ఆందోళనలని కలిగిస్తోంది. ప్రస్తుత వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల దాని ప్రభావం తగ్గలేదని వైద్యులు చెబుతున్నారు. స్వైన్‌ప్లూ బారి నుంచి తప్పించుకోవడానికి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.