ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. సంయమనం పాటించండి..!
గిరిజన తెగలు సంయమనం పాటించాలని, సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలని గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. విబేధాలు, ఘర్షణలు సమస్యలకు ఎంత మాత్రం పరిష్కారం కాదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అన్నివర్గాలకు న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
సోషల్‌మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని ఆయన సూచించారు. ఆదివాసీలు, లంబాడీలు ఐకమత్యంతో ఉండాలని, తాత్కాలిక భావోద్వేగాలకు లోనుకాకుండా సంయమనంతో మెలగాలని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని అన్నారు. విభేదాలను పక్కన పెట్టి గిరిజన తెగలు కలిసిమెలిసి ఉండాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక అన్ని వర్గాల, ప్రాంతాల అభివృద్దికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమ ప్రాధన్యతనిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఆదివాసీలు,లంబాడాల అభివృద్దికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.