తొలి టెస్ట్ లో ఓటమిపై కోహ్లీ ఏమన్నాడంటే ?

కివీస్ టూర్ లో కోహ్లీ సేన ఆరంభ శూరత్వం చూపింది. టీ20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఆ తర్వాత తుస్సుమంది. వన్ డే సిరీస్ లో కివీస్ చేత క్లీన్ స్వీప్ చేయబడింది. టెస్ట్ సిరీస్ లోనూ టీమిండియా పుంజుకోలేదు. తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైంది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడింది.

టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. అంతకుముందు కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టుకు 183 పరుగుల ఆధిక్యం లభించడంతో రెండో ఇన్నింగ్స్‌లో మరో తొమ్మిది పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడారు. తొలి ఇన్నింగ్స్‌లో చేసిన తక్కువ పరుగులే మ్యాచ్‌లో మేం వెనుకపడేలా చేసింది. బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం. మా బౌలర్లు రాణించేందుకు వారి ముందు పెద్ద స్కోర్‌ ఉంచాల్సింది కానీ, ఈ మ్యాచ్‌లో మేం అదే చేయలేకపోయాం. అయితే, పృథ్వీషా విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. అతను ఓవర్‌సీస్‌లో ఆడింది రెండు టెస్టులే కాబట్టి భవిష్యత్‌లో కచ్చితంగా రాణిస్తాడు. అలాగే మయాంక్‌ అగర్వాల్‌ ఒక్కడే రహానె తర్వాత బ్యాటింగ్‌లో నిలకడగా రాణించాడు” అని కోహ్లీ వివరించారు.