హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు
చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో మొదటి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నేరం రుజువుకావడంతో నిందితుడు మహ్మద్ రఫీ (27)కి ఉరిశిక్షని విధిస్తూ తీర్పునిచ్చింది. గతేడాది నవంబర్ 7న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ఓ వివాహ వేడుక కోసం జిల్లాలోని కురబలకోటకు వెళ్లింది. అక్కడ నిందితుడు మహ్మద్ రఫీ.. బాలికకు మాయ మాటలు చెప్పి కల్యాణ మండపం పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.
అక్కడ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటనపై తల్లిదండ్రులు మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని నాలుగురోజుల్లోనే అరెస్ట్ చేశారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక నిందితుడిపై నేరం రుజువుకావడంతో.. మరణశిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించింది.