గుడ్ బై.. ట్రంప్ !
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండ్రోజుల భారత్ పర్యటన ముగిసింది. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్ లో విందు అనంతరం ట్రంప్ నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సతీమణి మెలనియాతో కలిసి అమెరికాకు తిరుగు పయనమయ్యారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్ భారత్ లో గడిచిన రెండు రోజులు జీవితంలో మరువలేను అన్నారు. నాకు భారత్ పట్ల, ఇక్కడి ప్రజల పట్ల అపారమైన గౌరవం ఉంది. భారత్-అమెరికా సంబంధాలు సుదీర్ఘకాలం కొనసాగాలి. అన్నారు.
వచ్చే 50 ఏళ్లలో భారత్ దిగ్గజంగా నిలుస్తుందని ట్రంప్ అన్నారు. భారత్ లో మత స్వేచ్ఛపై ట్రంప్ స్పందించారు. గతంలో ఈ దేశంలో ముస్లింలు 14 కోట్లమంది ఉండేవాళ్లు.. ప్రస్తుతం ఆ సంఖ్య 20 కోట్లు దాటిందని మోదీ నాతో చెప్పారు. ముస్లింలకు స్వేచ్ఛ, రక్షణ ఉందనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారని అన్నారు. భారత్ మంచి మిత్ర దేశమే.. కాని వాణిజ్య లోటులో సానుకూలంగా ఉండాలని కోరుతున్నానన్నారు ట్రంప్. కశ్మీర్ అంశం భారత్ అంతర్గత విషయమని ట్రంప్ స్పష్టంచేశారు. ఇరుదేశాలు కోరుకుంటే.. భారత్, పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమని గతంలోనే చెప్పానన్నారు.