వారికి లోకేష్ పెద్దపీఠ.. దేనికి సంకేతం ?

కాంగ్రెస్’ది కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు అంటూ గతంలో ఆ పార్టీపై పోరాటం చేసేవారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. చివరకి ఆయన కాంగ్రెస్ తో జతకట్టాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఏకంగా కుటుంబ పాలనకి పెద్దపీఠ వేసే దిశగా పావులు కదుపుతున్నాడు.

టీడీపీ నేతల రాజకీయ వారసులతో నారా లోకేష్-బ్రాహ్మణి దంపతులు ఆదివారం హైదరాబాద్‌లో విందు సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల కుటుంబాలకు చెందిన వారసుల్లో ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కొందరిని ఎంపిక చేసి ఈ విందు భేటీకి ఆహ్వానించారు. వారసుల భార్య/భర్తలను సైతం పిలిచారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగితే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా లోకేష్‌ చెప్పినట్లు తెలిసింది.

హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు పరిటాల శ్రీరాం, టీజీ భరత్, మాగంటి రాంజీ దంపతులు, మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు కుమారులు, కోడళ్లు తదితరులు పాల్గొన్నారు.

అసలు ఈ సమావేశం ద్వారా నారా లోకేష్ ఏం చెప్పాలనుకున్నాడు ? ఆయన వారసత్వ రాజకీయాలని ప్రోత్సహించాలను కుంటున్నారా… ?? అంటే లక్ష్యం పూర్తిగా అదికాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీఎం జగన్ యువతకి పెద్దపీఠ వేస్తున్నారు. ముఖ్యంగా మాజీ నేతల వారసులని ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఇస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో తెదేపా మాజీ తాజా వారసులు చేజారకుండా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.