రాహుల్ ను తక్కువగా అంచనా వేయొద్దు..!!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ పై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రశంసలు కురిపించారు. గుజరాత్ లో బీజేపీ గెలిచినా బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలిగారని కొనియాడారు. దేశంలో రాహుల్ శకం మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీపై ఉద్ధవ్ ప్రశంసలు కురిపించారు. గుజరాత్‌లో ఫలితం ఎలా ఉన్నా కాంగ్రెస్ బాధ్యతలు మోయడంలో రాహుల్ పరిపూర్ణత సాధించారన్నారు. కాంగ్రెస్ భారం మొత్తం ఇప్పుడు రాహుల్ భుజస్కందాలపై ఉందని, బీజేపీకి ఎదురొడ్డి నిలబడగల నేత కూడా రాహుల్ గాంధీయేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీని ఎవరూ తక్కువ అంచనా వేయకూడదని ఉద్ధవ్ చెప్పారు.
గుజరాత్‌లో కాకలు తీరిన రాజకీయ నేతలు ఉన్నప్పటికీ యుద్ధభూమిలో రాహుల్ గాంధీ ఎదురొడ్డి నిలబడ్డారని, ఈ విశ్వాసమే ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ముందుకు నడిపిస్తుందన్నారు. అధికార పార్టీ రాహుల్ గాంధీని విమర్శించడం మాని ప్రజాసమస్యలపై దృష్టిపెడితే మంచిదని బీజేపీకి ఉద్ధవ్ చురకలంటించారు. శివసేన సొంత పత్రిక అయిన ‘సామ్నా’లో ప్రచురితమైన సంపాదకీయంలో ఉద్ధవ్ ఈ విషయాలు పేర్కొన్నారు.