ఏపీలో 25జిల్లాలు.. లీక్ చేసిన సీఏం కేసీఆర్ !
10 జిల్లాల తెలంగాణకి సీఎం కేసీఆర్ ప్రభుత్వం 33 జిల్లాలుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణను చూశాకే ఏపీ ప్రభుత్వం కూడా జిల్లాలు చేసే యోచనలో ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో 25 జిల్లాలు ఏర్పాటుచేసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం జగన్ తనతో మాట్లాడిన ప్రకారం ఏపీ జిల్లాల లెక్క ఇదన్నారు. ఇంతకీ ఏపీ జిల్లాల సంఖ్యని సీఎం కేసీఆర్ ఎందుకు లీక్ చేసినట్టు అంటే.. ?
శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ నేతలు కొందరు వద్దని అంటే.. మరికొందరు నేతలు కొత్త జిల్లాలకు డిమాండ్ చేశారని.. వాళ్లలో వాళ్లకే బేధాభిప్రాయాలని ఎద్దేవా చేశారు.
భారతదేశ చరిత్రలో అన్ని రాష్ట్రాలూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాయనీ.. పశ్చిమబెంగాల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చేయలేదన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నం. తెలంగాణను చూశాకే ఏపీ ప్రభుత్వం కూడా జిల్లాలు చేసే యోచనలో ఉంది. ఏపీ సీఎం జగన్ తనతో మాట్లాడిన దాన్నిబట్టి, తనకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 25 జిల్లాలు ఏర్పాటుచేసే అవకాశం ఉందని తెలిపారు.