లోకల్ ఎఫెక్ట్.. ‘వకీల్‌సాబ్’ రిలీజ్ వాయిదా !
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకి బ్యాడ్ న్యూస్. ‘అజ్ఝాతవాసి’ తర్వాత పవన్ పొలిటికల్ గా బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇక తన జీవితమంతా ప్రజాసేవకేనని ప్రకటించేశారు. దాంతో.. పవన్ అభిమానులు ఢీలా పడిపోయారు. ఇకపై పవన్ ని తెరపై చూడలేమేమోనని కంగారుపడ్డారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఆశించిన స్థాయిలో రాణించకపోవడం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలన్న డిమాండ్ అభిమానుల నుంచి జోరందుకుంది.
వారి కోరికని తీరుస్తూ.. పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. పింక్ రిమేక్ ‘వకీల్ సాబ్’ తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. మే 15న వకీల్ సాబ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కానీ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వకీల్ సాబ్ రిలీజ్ వాయిదా పడే అవకాశాలున్నట్టు సమాచారమ్. ఈ సినిమా ఇంకా నెల రోజుల పాటు విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలని ఏమాత్రం అందుకోని జనసేన పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భవిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్ కోసం అందుబాటులో ఉండటం కష్టమే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వకీల్ సాబ్ మే 15న కాకుండా నెల ఆలస్యంగా రిలీజ్ కావొచ్చనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంలో నిజమెంత ? అనేది తెలియాలంటే.. చిత్రబృందం స్పందించాల్సిందే.