కేంద్రాన్ని నిలదీయ్.. జగన్ : కేవీపీ
రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం జగన్ కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ. ప్రధాని నరేంద్రమోదీతో పాటు సీఎం జగన్ కు కేవీపీ బహిరంగ లేఖలు రాశారు. పారిశ్రామిక పన్ను రాయితీలు, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, కేంద్రప్రభుత్వ పథకాలకు 90 శాతం నిధులు ఇవ్వాలని మోదీకి రాసిన లేఖలో కోరారు.
విభజన చట్టం అమలుపై రాజ్యసభలో మరోసారి ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టానని.. కానీ దురదృష్టవశాత్తు అది చర్చకు రాలేదన్నారు కేవీపీ. ప్రత్యేకహోదా అంశంలో కుంటిసాకులతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. పారిశ్రామిక పన్ను రాయితీలు రాష్ట్రానికి ఇవ్వాలని కేవీపీ డిమాండ్ చేశారు. గత ఆరేళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇస్తున్న 60 శాతం నిధులకు మరో 30 శాతం లెక్కకట్టి ఇవ్వాలని.. మిగతా రాష్ట్రాలతో సమానంగా ఏపీ నిలబడేవరకు సహాయం అందించాలని ప్రధానిని కేవీపీ కోరారు.
దివంగత ఏపీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రాణ స్నేహితుడు కేపీవి. కేవిపీ తన ఆత్మ అని పలు సందర్భాల్లో రాజశేఖర్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జగన్ కాంగ్రెస్ ని వీడి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేవీపీ కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు.