వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓట్లు వేయాలట.. !
తెదేపా అధినేత చంద్రబాబు వైకాపా ఎమ్మెల్యేలపై ఆశలు పెట్టుకున్నారు. వారిని కూడా టీడీపీకి ఓట్లు వేయాలని కోరుతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఏపీలో నాలుగు స్థానాలకి గానూ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఆ నాలుగు స్థానాలు కూడా వైకాపా గెలుచుకోనుంది. ఇప్పటికే వైకాపా అభ్యర్థులని ఖరారు చేసింది. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైకాపా సీనియర్ నేత అయోధ్య రామిరెడ్డితో పాటు పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు పరిమళ్ నత్వానికి సీట్లను కేటాయించింది.
అయితే ఒక్క రాజ్యసభ సీటు గెలిచే బలం లేకున్నా అభ్యర్థిని నిలబెట్టింది టీడీపీ. సీనియర్ నేత వర్ల రామయ్యను అభ్యర్థిగా పోటీలో నిలిపాడు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ అభ్యర్థులకి ఓ విజ్ఝప్తి చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారో.. ఒప్పు చేస్తున్నారో..? తెలుసుకోవాలని.. తప్పని భావిస్తే వర్లకు ఓటెయ్యాలని బాబు సూచించారు. తప్పని తెలిసినా భయపడితే వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తారన్నారు.
బాబు ఆశలు, మాటలు విచిత్రంగా అనిపించకమానదు. సొంత పార్టీ నేతలే ఓటు వేస్తారనే గ్యారెంటీ లేదు. అలాంటిది చంద్రబాబు ప్రత్యర్థి పార్టీ వైకాపా ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని ఆశపడటం ఏంటో.. ? రాజ్యసభ ఎన్నికల్లో తెదేపా పోటీలో లేదు. ఆ పార్టీకి ఆ బలం లేదనే నింద నుంచి తప్పించుకోవడానికి.. బాబు ఈ వ్యూహాన్ని ఎంచుకొని ఉంటారేమో.. !