లోకల్ ఎఫెక్ట్.. టీడీపీ ఖాళీ !

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. అయితే ఈ ఎన్నికలు పూర్తయ్యేలోగా టీడీపీ దాదాపు ఖాళీ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ఆపరేషన్ ఆకర్ష్ కి తెరలేపిన సంగతి తెలిసిందే. దీంతో రోజుకో తెదేపా కీలక నేత వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేలోగా తెదేపా దాదాపు ఖాళీ కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాస్తవానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే గత యేడాదియే తెదేపా దాదాపు ఖాళీ అయ్యేది. గత యేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకి గానూ.. వైకాపా ఏకంగా 151 స్థానాలని గెలుచుకొంది. తెదేపా కేవలం 23 స్థానాలకే పరిమితం అయింది. ఆ సమయంలో సీఎం జగన్ ఆపరేషన్ ఆకర్ష్ కి తెరలేపి ఉంటే.. తెదేపా దాదాపు ఖాళీ అయ్యేదే. కానీ సీఎం జగన్ అలా చేయలేదు. ఒకవేళ వైసీపీలో చేరాలనుకొనే నేతలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాల్సి ఉంటుందనే షరతు పెట్టారు.

ఆ షరతు కారణంగానే ఇటీవల మండలిలో వైకాపాకి ఇబ్బందులు ఎదురయ్యాయ్. అప్పుడే తెదేపా ఎమ్మెల్సీలకి గాలం వేస్తే మూడు రాజధానుల బిల్లు విషయంలో ఎలాంటి సమస్యలు ఉండేవి కాదు. ఇతర బిల్లుల ఆమోదానికి మండలిలో సమస్య ఉండేది కాదు. అసలు మండలిని రద్దు చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. చాలా లేటుగా రియలైజ్ అయిన సీఎం జగన్.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెదేపా నేతలని వీలైనంత వరకు లాగాలని మంత్రులు, కీలక నేతలకి సూచించారు. ఇప్పుడు వారు అదే పనిలో ఉన్నారు. ఈ ఎఫెక్ట్ తో తెదేపా దాదాపు ఖాళీ అయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.