వైసీపీలోకి కరణం బలరాం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెదేపా ఖాళీ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ పార్టీ కీలక నేతలు వరుసపెట్టి వైసీపీలో చేరుతున్నారు. తాజాగా తెదేపా కీలక నేత కరణం బలరాం వైసీపీలో చేరబోతున్నట్టు అధికారికంగా ప్రకటన చేశారు. తనపై నమ్మకం పెట్టుకొన్న చీరాల ప్రజల కోసమే వైసీపీలో చేరబోతున్నా. చీరాల అభివృద్ధి కోసమే వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకునానని కరణం తెలిపారు. 

రాష్ట్రంలో వైసీపీ గాలి వీచిన సమయంలో చీరాల ప్రజలని తనని 20వేల మెజారిటీతో గెలిపించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు, చీరాల అభివృద్ది కోసం వైసీపీలో చేరుతున్నానని బలరాం తెలిపారు. అంతకుముందు ఆయన నియోజకవర్గ అనుచరులతో సమావేశం అయ్యారు. వైసీపీలో చేరడంపై వారితో చర్చించినట్టు తెలుస్తోంది. 

మరోవైపు, కరణం పార్టీ మారుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో పట్టు చేజారకుండా తెదేపా అధినేత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఖాళీ అవుతున్న స్థానంలో కొత్త నేతలని నియమించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారమ్.