కరోనా.. చిరు సూచనలు పాటించండి !


ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా వైరస్ కు మందు లేదు. ముందు జాగ్రత్తలే శరణ్యం. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టాలీవుడ్ స్టార్స్ తమ వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి.. తదితరులు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలని వీడియోల రూపంలో విడుదల చేశారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనాపై ప్రజలకి సూచనలు చేశారు. చిరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘మనకేదో అయిపోతుంది అనే భయం కానీ మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ పనికిరావు ..జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత దూరంగా ఉండండి.. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితమవడం ఉత్తమం’ వీడియో సందేశం విడుదల చేశారు చిరు.

కరోనా ప్రభావంతో పలు సినిమాల షూటింగ్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమా కూడా కరోనా ప్రభావంతో వాయిదా పడింది. కరోనా ప్రభావం తగ్గాక కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరు మాజీ నక్సలైట్ గా, దేవాదాయ శాఖ అధికారిగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.