కరోనా కట్టడి : సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం
తెలంగాణలో కరోనా వైరస్ లేదు. కానీ విదేశాల నుంచి వస్తున్న వారితో ఇక్కడి వారికి సోకే ప్రమాదముంది. దేశంలో జరిగిన తొలి కరోనా మృతి హైదరాబాద్ తో సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. అతడు హైదరాబాద్ లో చికిత్స పొందాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యాసంస్థలు, థియేటర్స్, దేవాలయాల మూసివేతకి ఆదేశించింది.
బుధవారం కరీంనగర్ లో 8మందికి కరోనా పాజిటివ్ తేలడంతో తెలంగాణ ప్రభుత్వం షాక్ కి గురైంది. వీరందరు ఇండోనేషియా నుంచి వచ్చారు. రైల్ లో ప్రయాణించారు. వాహనంలో తిరిగారు. కరీంనగర్ లో పలు ప్రార్థనా స్థలాలని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఇండోనేషియా బృందం కలిసిన వారిని గుర్తించడం ప్రభుత్వానికి సవాల్ గా మారింది.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, మహముద్ అలీ, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షిస్తున్నారు.