ఆఖరి కోరిక చెప్పలేదు.. కానీ ఏడ్చేశారు !
నిర్భయ దోషులకి పాపం పండింది. ఈ లోకంలో నూకలు చెల్లాయి. నిర్భయ దోషులైన ముకేశ్ సింగ్ (32), పవన్ గుప్త (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)లను ఈ ఉదయం 5:30 గంటలకి తిహార్ జైలులో ఉరి తీశారు. జైలు నంబరు 3లో ఒకేసారి నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. అంతకుముందు నిర్భయ దోషుల ఆఖరి కోరిక తీర్చడానికి జైలు అధికారులు ప్రయత్నించారు. ఏమైనా ఆఖరి కోరిక ఉందా ? అని దోషులని ప్రశ్నించారు. దానికి తమకి ఎలాంటి ఆఖరి కోరికలు లేవని దోషులు చెప్పినట్టు జైలు అధికారులు తెలిపారు.
ఉరిశిక్షని అమలు చేసే ముందుకు మాత్రం దోషులు వెక్కివెక్కి ఏడ్చారు. ఉరి కంబం వద్దకు తీసుకెళ్లే కంటే ముందు నలుగురు దోషులు బోరున విలపించినట్లు జైలు అధికారులు తెలిపారు. తమకు కేటాయించిన సెల్స్లో దోషులు కంటతడి పెట్టారు. ఆ సమయంలో ఎలాంటి నాటకాలు ఆడలేదు. ఆత్మహత్యకి ప్రయత్నించలేదు. ఏడుస్తూ ఉరి కంభం దగ్గరికి వెళ్లినట్టు అధికారులు తెలిపారు. కోర్టు ఆదేశించిన సమయం ప్రకారమే ఉదయం 5:30 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు.
అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దీన్దయాల్ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టమ్ పూర్తయిన తర్వాత మృతదేహాలని కుటుంబ సభ్యులకి అందించనున్నారు. ఒక వేళ వారి కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకెళ్లేందుకు ముందుకు రాకపోతే… పోలీసులే అంత్యక్రియలు నిర్వహిస్తారు.