కరోనా ఎఫెక్ట్.. ఒకొక్కరికి 10 తిరుపతి లడ్డూలు !
తిరుమల శ్రీవారికి కరోనా ఎఫెక్ట్ తప్పలేదు. కరోనా ప్రభావంతో తిరుమల దేవస్థానం మూతపడిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిపోయిన తిరుపతి లడ్డూలని ఉచితంగా పంచుతోంది టీటీడీ. మిగిలిపోయిన 2.4లక్షల లడ్డూలని ఒక్కో ఉద్యోగికి 10 చొప్పున పంచుతున్నారు. రిటైర్డ్మెంట్, కాంట్రాక్ట్, పర్మినెంట్ ఉద్యోగులకి లడ్డూలని పంచుతున్నారు.
ప్రతిరోజూ తిరుమల శ్రీవారి దర్శనం కోసం 80 వేల నుంచి లక్ష మంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో 3లక్షల నుంచి 3.5లక్షల లడ్డూలని తయారు చేస్తుంటారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో తిరుమల దేవస్థానం మూతపడటంతో మిగిలిపోయిన 2.4లక్షల లడ్డూలని ఉద్యోగులకి పంచుతున్నారు. ఇక ఆలయం మూతపడిన శ్రీవారికి అన్ని రకాల సేవలు చేస్తున్నారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధన్వంతరం యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి మూడ్రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. లోక కల్యాణం కోసమే ఈ యాగం నిర్వహించ బోతున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇక కరోనా ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలన్నీ మూతపడ్డాయి. తిరుమల దేవస్థానం మూతపడటం చరిత్రలో ఇది రెండోసారి. ఇక గ్రహణ సమయాల్లోనూ మూతపడని శ్రీకాళహస్తి దేవాలయం కూడా కరోనా దెబ్బతో మూతపడింది.