ఆ విషయం దాస్తే జైలుకే

విదేశాలకి వెళ్లొచ్చిన విషయం దాస్తే జైలుకేనని హెచ్చరిస్తున్నారు పోలీసులు. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఇటీవల లండన్ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం దాచి.. లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో నిర్వహించిన పార్టీలో పాల్గొంది. ఈ పార్టీకి ఎంపీ దుష్యంత్ సింగ్ పాల్గొన్నారు. పార్టీలో కనికాతో దుష్యంత్ సరదాగా గడిపారు. మరుసటి రోజు దుష్యంత్ రాష్ట్రపతితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాలకి హాజరయ్యారు. ఆ తర్వాత కనికకి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, ఎంపీలు అందరూ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
 
ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు కనికా కపూర్ పై పోలీస్ కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే ఆమెకి ఆరేళ్ల జైలు శిక్ష, జరిమానా పడనుంది. ఇక మహారాష్ట్రలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మహారాష్ట్రలో విదేశీ పర్యటనకు విషయాన్ని దాచినందుకు ఇద్దరు దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ అమల్నర్‌లో జరిగింది. ఎవరైనా విదేశాలకి వెళ్లొచ్చిన విషయం దాస్తే జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.