కరోనాతో యుద్ధం జీవితకాల సవాల్ : మోడీ
కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమో అర్థంచేసుకొని, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న మీడియాకు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. సరికొత్త, సృజనాత్మక పరిష్కారాలతో ఈ మహమ్మారిని కట్టడి చేయాలని మీడియా ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకి కొన్ని సూచనలు చేశారు.
పాత్రికేయులు, కెమెరా పర్సన్స్, సాంకేతిక నిపుణులు దేశానికి అవిశ్రాంతంగా సేవలందిస్తున్నారు. సానుకూల భావప్రసారంతో నిరాశావాదం, భయాన్ని మీడియా తరిమికొట్టాలి. కొవిడ్-19 జీవితకాల సవాల్. వినూత్న, సృజనాత్మక పరిష్కారాలతో దానిని తరిమికొట్టాలి అన్నారు మోడీ. ఒక సుదీర్ఘ యుద్ధం మన ముందుంది. ప్రజలకు అర్థమయ్యే సులభ భాషలో సామాజిక దూరం ఎంత ముఖ్యమో మీడియా తెలియజేయాలి. కీలక నిర్ణయాలు, తాజా విషయాలను వివరించాలి. ముఖాముఖి చేసేటప్పుడు కనీసం ఒక మీటరు దూరం ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు.