పవన్ కరోనా సాయం రూ. 2కోట్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరొసారి గొప్ప మనసుని చాటుకొన్నారు. ఆయన చాలామందికి సాయం చేశారు. కానీ ఆ విషయాలేవీ బయటికి తెలియదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తాజాగా కరోనా కట్టడి కోసం కేంద్రానికి, రెండు తెలుగు రాష్ట్రాలకి విరాళం ప్రకటించారు. పీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయలు, ఒక్కో తెలుగు రాష్ట్రానికి రూ. 50లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.

పవన్ ని ఆదర్శంగా తీసుకొని మెగా పవర్ స్టార్ రామ్ కూడా ముందుకొచ్చారు. తన వంతు సాయంగా రూ. 70లక్షలు ప్రకటించారు. తన బాబాయ్ ని పవన్ కల్యాణ్ ని ఆదర్శంగా తీసుకొని ఈ సాయం చేస్తున్నట్టు చరణ్ ప్రకటించడం విశేషం. చరణ్ ఒక్కడే కాదు.. మరికొందరు టాలీవుడ్ నటీనటులు పవన్ ని ఆదర్శంగా తీసుకొని కరోనా కట్టడికి తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. అంతకుముందు పవన్ వీరాభిమాని, హీరో నితిన్ ఒక్కో తెలుగు రాష్ట్రానికి రూ. 10లక్షల చొప్పున విరాళం అందజేసిన సంగతి తెలిసిందే.

ఇక వకీల్ సాబ్ గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు పవన్. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు, బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో వకీల్ సాబ్ షూటింగ్ వాయిదాపడింది. దీంతో మే నెలలో రావాల్సిన వకీల్ సాబ్ వాయిదా పడేలా కనిపిస్తోంది. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత హరీష్ శంకర్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ సినిమాలు ఉండనున్నాయి.