‘వియత్నాం’ గట్టి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే !
కరోనా దెబ్బకు అభివృద్ది చెందిన దేశాలన్నీ అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇరాన్.. విలవిలలాడుతుంటే చైనా పక్కనే ఉన్న చిన్ని దేశం వియత్నాం మాత్రం కరోనాను విజయవంతంగా కట్టడి చేయగలిగింది. ఇక్కడ కేసులు ఇప్పటికీ వందల్లోనే ఉండటం గమనార్హం. మృతుల సంఖ్య దాదాపు సున్నా అని వియత్నాం ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న ఈ చిన్నదేశం కరోనాను ఎలా కట్టడి చేసింది ? అంటే ముందు జాగ్రత్త. చైనాలోని వుహాన్లో 2019 చివరి నాళ్లలో కరోనా మహమ్మారి వెలుగుచూసింది. దీనిపై చైనా పూర్తిగా అధ్యయనం చేయకముందే వియత్నాం ఈ ప్రమాదాన్ని ఊహించింది. వెంటనే నూతన సంవత్సరంలో కట్టడి చర్యలు ప్రారంభించింది. చైనాలోని లాక్డౌన్ జనవరి 20 తర్వాత ప్రారంభం కాగా వియత్నాంలో జనవరి 1 నుంచే పలు ప్రాంతాల్లో అమలు చేశారు.
వియత్నాంలో మూడు వారాలు, నాలుగు వారాలు లాక్డౌన్ పాటించారు. కొత్తగా కేసులు నమోదు కాకపోవడంతో ఆ వ్యవధి అనంతరం లాక్డౌన్ ఎత్తివేశారు. ప్రజలు ఇంటిలో ఉంటే దేశానికి సేవచేసినట్టేనని ప్రభుత్వం ప్రచారం చేసింది. కరోనా కట్టడిలో విజయవంతం అయింది. ఇప్పుడు అగ్రదేశాలకి ఆదర్శంగా నిలుస్తోంది. అందుకే వియత్నాం గట్టి ప్రయత్నాన్ని ఆందరూ అభినందించాల్సిందే.