కరోనా ‘వైరస్’ గురించి రెండేళ్ల క్రిందటే చెప్పిన వర్మ 

ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా ‘వైరస్’ గురించి రెండేళ్ల క్రిందటే హెచ్చరించారు దర్శకుడు రామ్ గోపాల్. ‘వైరస్‌’ అనే టైటిల్‌తో సినిమా తీయబోతున్నట్లు వర్మ రెండేళ్ల క్రితం ప్రకటించారు. ‘సర్కార్‌’, ‘ది ఎటాక్‌’ చిత్రాల నిర్మాత పరాగ్‌ సంఘ్వీ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వర్మ 10/6/2018లో ట్వీట్‌ చేశారు. పూర్తి ప్రకటన కోసం ఫేస్‌బుక్‌ లింక్‌ను కూడా షేర్‌ చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తన వైరస్ కథ, ఆ నాటి ట్విట్ ని గుర్తి చేశారు వర్మ.

ఇంతకీ వర్మ వైరస్ కథేంటీ అంటే ? ‘ఆఫ్రికా పర్యటనకు వెళ్లి ముంబయి వచ్చిన ఓ యువకుడి ద్వారా వైరస్‌ అందరికీ సోకుతుంది. ఊహించని ఈ పరిణామంతో ప్రభుత్వం కోట్లాది ప్రజలున్న ముంబయిలో ఒకరి నుంచి మరొకరు 20 అడుగుల దూరం ఉండాలని సూచిస్తుంది. ఆపై వైరస్‌ విపరీతంగా వ్యాపించి, లక్ష మందికిపైగా మృతి చెందుతారు. ఈ నగరం నుంచి రాకపోకల్ని నిషేధిస్తారు. భయబ్రాంతులకు గురైన ముంబయి వాసులు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. దీంతో ఎవరు ఈ వైరస్‌ను వ్యాప్తి చేస్తారో అన్న భయంతో.. పారిపోయే వారిని కాల్చి చంపేయమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ కథకు భయం, ప్రేమ, ఉత్కంఠ, త్యాగం, ఆశల్ని మేళవించి హ్యూమన్‌ డ్రామాగా సినిమా రూపొందించబోతున్నాం’ అని వర్మ రెండేళ్ల క్రితమే ప్రకటించారు.

అయితే ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. బహుశా.. ఇప్పుడు ఇదే స్క్రిప్టుకి కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేసి.. కరోనా వైరస్ పేరిట వర్మ సినిమా తీసిపారేస్తారేమో చూడాలి.