టీ-కాంగ్రెస్ టికెట్ పాలిటిక్స్
ఎన్నికల వ్యూహాలని అమలు చేయడంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవహారిస్తారని చెబుతుంటారు. ఇప్పుడు టీ-కాంగ్రెస్ కూడా ముందస్త వ్యూహాలని రెడీ చేసుకొంటున్నట్టు కనబడుతోంది. ఎన్నికల్లోగా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ఓటుబ్యాంకు పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఆ పార్టీ.
సభలు సమావేశాల ద్వారా పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడమే కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడింది. ముందునుంచి పార్టీకి నిబద్ధతగా పనిచేస్తూ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న క్యాండెట్లను ముందుగానే సమావేశాల్లో ప్రకటించి ఎడాది ముందుగానే అభ్యర్థిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థిత్వం ఖరారు చేస్తే పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా గెలుపుకోసం మరింత నిబద్దతగా పార్టీ శ్రేణులు పనిచేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు.
ఒకవేళ ఎవరైనా ఆశావహులు ఉన్నా అభ్యర్థి పేరు ఖరారు చేసిన తరువాత ఆశలు ఎక్కువ పెంచుకోకుండా సర్దుకు పోతారు కూడా అని అనుకుంటున్నారు టీపీసీసీ నేతలు. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో టీపీసీసీ అధ్యక్షులు సభావేదికపైనే నేరుగా పలానా అభ్యర్థిని గెలిపించండి అంటూ పిలుపునివ్వడం ఆయా నియోజకవర్గ అభ్యర్థుల పేరును ఖరారు చేసినట్లయింది. గతంలో హుస్నాబాద్, తాండూరు, డోర్నకల్, ఆలేరు నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో ఉత్తమ్ ప్రత్యక్షంగా ప్రకటన చేయడం పార్టీలో, పలు నియోజకవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రకటన చేసిన నియోజకవర్గాల సంగతి పక్కనబెడితే, మిగతా నియోజకవర్గాల్లోకూడా టికెట్ ఆశించే వ్యక్తులు పోటాపోటీగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు భారీ సభలను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. మరి టీకాంగ్రెస్ టికెట్ పాలిటిక్స్ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి మరి.. !