ఐసీయూలో బ్రిటన్ ప్రధాని  

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. గత గురువారం ఆయనకు కరోనా పాజిటివ్‌ తేలడంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. వైరస్‌ లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో ఆదివారం ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం నాటికి వ్యాధి తీవ్రత పెరగడంతో వైద్యులు ఆయన్ను హుటాహుటిన ఐసీయూకి తరలించారు. దీంతో ప్రధాని ఆరోగ్యంపై బ్రిటన్ ప్రజల్లో కలవరం మొదలైంది.

కరోనా లక్షణాలతో సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిన తర్వాత బోరిస్‌ జాన్సన్‌ దేశ ప్రజలకి వీడియో సందేశం పంపిన సంగతి తెలిసిందే. ‘నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉంది. నా ఏడు రోజుల నిర్బంధం కూడా పూర్తయింది. అయినా, నాలో ఇంకా స్వల్పంగా వైరస్‌ లక్షణాలు ఉన్నాయి. ఇంకా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత కాలం నేను స్వీయ నిర్బంధంలో ఉంటాను’ అని జాన్సన్‌ తెలిపారు.