కోమటిరెడ్డి సెల్ఫ్ గోల్ ?
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంపై జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పైర్ బ్రాండ్’గా పేరున్న ఇద్దరు బ్రదర్స్ తాజా రాజకీయాలపై ఒక్కొక్కరు ఒక్కోలా అనుకుంటున్నారట. గతంలో భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా రాజగోపాల్ రెడ్డే భువనగిరి ఎంపీగా పోటీ చేస్తారని భావించారు అంతా.. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు.
ఎమ్మెల్యేగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా తానే ఎంచుకున్నారు. కొంతకాలం క్రితం మునుగోడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన బలాన్ని ప్రదర్శించుకున్నారు. అయితే మునుగోడు టికెట్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురుకు ఆల్రెడీ కన్పన్ అయినట్లే అని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంత చేసినా లాభం లేదని చెప్పుకుంటున్నారు అంతా.
మునుగోడులో పోటీ చేస్తారనే సంకేతాలివ్వడం ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ సంకేతాల ద్వారా ఇటు భువనగిరి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన అనుచరులంతా తలోదారి చూసుకునే అవకాశం ఉందని, ఇక భువనగిరికి రారనే స్పష్టత ఇచ్చినట్లేనని భావిస్తున్నారు.
నియోజవర్గవాసుల్లో కూడా ఈ అంశం బలంగా పాతుకుపోతుందట. అటు మునుగోడు టికెట్ పై కూడా పెద్దగా క్లారిటీ లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఏమిటనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఏదేమైనా కోమటిరెడ్డి స్వయంగా తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారనే అంటున్నారు అంతా.. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో.. !