లాక్‌డౌన్ ని పొడిగించిన తొలి రాష్ట్రం
కరోనా ప్రభావంతో దేశంలో 21 రోజుల పాటు.. అంటే ఈ నెల 14 వరకు కేంద్రం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లాక్‌డౌన్ పొడగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయితే, లాక్‌డౌన్ పొడగింపుపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇంతలో ఒడిషా ప్రభుత్వం లాక్‌డౌన్ ని మరో 15రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 14 వరకు ఉన్న లాక్‌డౌన్ పిరియడ్‌ను మరో 15 రోజులు పెంచుతూ ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సీఎం నవీన్ పట్నాయక్ అధ్యక్షతన ఐదుగురు సీనియర్ మంత్రులతో నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి ఆమోదం తెలుపుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం ఒడిషాగా నిలిచింది.