వైకాపాపై పవన్ ఈసీకి ఫిర్యాదు
కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన రాజకీయాల జోలికి వెళ్లడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో పవన్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని వైకాపా నేతలతో పంపిణీ చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని సభ్యులకు పవన్ సూచించారు.
‘కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరి అయింది. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు పార్టీ పరంగా అన్ని విధాలా సహకరిద్దాం. వారికి ఏ విధంగా సాయం చేయాలనేదానిపై ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్దాం. ఇలాంటి సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారుల నుంచి తగిన సేవలు అందేలా చూడాలి’ అని పవన్ సభ్యులను కోరారు.