‘జన్‌ ధన్‌’ డబ్బులు వెనక్కిపోవు

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన కేంద్రం పలు ఉద్దీపన పథకాలని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జన్‌ధన్‌ యోజన ఖాతాల్లో రూ. 1500 జమ చేస్తామని కేంద్రం తెలిపింది. ఇప్పటికే  ఏప్రిల్‌ నెలకు సంబంధించి రూ.500ను ఇప్పటికే జమచేశారు. అయితే ఆ డబ్బులని త్వరగా విత్ డ్రా చేసుకోకపోతే వెనక్కిపోతాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులు బ్యాంకులకి క్యూ కడుతున్నారు. దీంతో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వద్దంతులపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాల్లో జమ చేసిన డబ్బులను ప్రభుత్వం వెనక్కి తీసుకోదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వదంతులను ప్రజలు నమ్మొద్దని సూచించింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి రూ.500ను ఇప్పటికే జమచేశామని వెల్లడించింది. మిగిలిన వెయ్యి రూపాయలను రూ.500 చొప్పున తర్వాతి రెండు నెలల్లో జమచేస్తామని స్పష్టం చేసింది.