మోడీ కంటే ముందే కేసీఆర్ ప్రకటన చేస్తారా ?

ఈ నెల 14 తర్వాత కూడా దేశంలోలాక్‌డౌన్‌ పొడగించడం దాదాపు ఖాయమైంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లోనే ప్రధాని మోడీ ప్రకటన చేయొచ్చు. అయితే అంతకంటే ముందే లాక్‌డౌన్‌ పొడగింపుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్‌ భేటీ కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తారు.

లాక్‌డౌన్‌ పొడిగించాలన్న ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. కేబినేట్ భేటీ తర్వాత లాక్‌డౌన్‌ పొడగింపుపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ మరో 15రోజుల పాటు లాక్‌డౌన్‌ ని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రానికి కంటే ముందే లాక్‌డౌన్‌ పొడగింపుపై ప్రకటన చేసేందుకు రెడీ అవుతుందని తెలుస్తోంది.

రేపటి కేబినేట్ సమావేశంలోలాక్‌డౌన్‌ పొడగింపుతో పాటుగా వరి ధాన్యం సహా ఇతర పంటల కొనుగోళ్లు, ఏర్పాట్లు, పరిస్థితులపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వడగండ్ల వానలు, పంటనష్టం సహా రైతులకు అందించాల్సిన సాయం తదితర అంశాలపై కేబినేట్ లో చర్చిస్తారని సమాచారమ్.