ఐపీఎల్‌ అప్‌డేట్‌.. ఏంటంటే ?

దేశంలో లాక్‌డౌన్‌ మరో రెండు వారాల పాటు.. అంటే ఏప్రిల్ 30 వరకు పొడగించనున్నారు. ఈ మేరకు నిర్ణయం జరిగిపోయింది. కేంద్రం నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంలోనే లాక్‌డౌన్‌ పొడగింపుపై ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15కి వాయిదా పడిన ఐపీఎల్ నిర్వహణ అసాధ్యమే. అసలు ఈ యేడాది ఐపీఎల్ నిర్వహణ ఉంటుందా ? లేదా ?? అన్నది కూడా అనుమానమే.

దీనిపై రేపు (సోమవారం) అప్ డేట్ ఇస్తామన్నారు బీసీసీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ. “కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏం జరుగుతుందో అంతా గమనిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం ఏం చెప్పలేం. అయినా, ఇప్పుడు చెప్పడానికి ఏముంది? విమానాశ్రయాలు మూతపడ్డాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు, కార్యాలయాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లలేరు. ఈ పరిస్థితి మే మధ్య వరకూ ఉంటుందనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారు. ఐపీఎల్‌ను పక్కన పెట్టండి. కాస్త ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే.. ప్రపంచంలో ఎక్కడా ఏ క్రీడలు నిర్వహించడానికి కూడా అవకాశం లేదు. అయినా ఐపీఎల్ నిర్వహణపై సోమవారం అప్ డేట్ ఇస్తాం’ అన్నారు గంగూలీ.