అమెరికా చరిత్రలోనే ట్రంప్ తొలిసారి
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా దేశవ్యాప్త విపత్తుగా ప్రకటించింది. ఇలా ప్రకటించడం అమెరికా చరిత్రలోనే తొలిసారి. తొలి కేసు నమోదైనప్పటి నుంచి తీవ్రతను బట్టి ఒక్కో రాష్ట్రంలో విపత్తును ప్రకటిస్తూ వచ్చిన శ్వేతసౌధం చిట్టచివరిగా శనివారం వ్యోమింగ్‌కూ దాన్ని వర్తింపజేసింది. దీంతో అన్ని రాష్ట్రాలు మహా విపత్తును ఎదుర్కొంటున్నట్లుగా గుర్తించిట్లైంది.
దీనివల్ల ఫెడరల్ ప్రభుత్వ నిధుల్ని రాష్ట్రాలు వినియోగించే వెసులుబాటు కలుగుతుంది. అలాగే కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు నేరుగా శ్వేతసౌధం నుంచే నిధులు అందుతాయి. ఇతర అత్యవసర సేవల్ని కూడా ఫెడరల్ ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. ఇక కరోనా మరణాల సంఖ్యలోనూ అమెరికా ఇటలీని దాటేసింది. శనివారం కొత్తగా 1912 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 20,597కు చేరింది.