లాక్‌డౌన్‌ గైడ్ లైన్స్ విడుదల

కరోనా కట్టడి కోసం దేశంలో మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడగించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ని కేంద్రం తాజాగా విడుదల చేసింది. అయితే ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్‌ నుంచి కొన్ని రంగాలకి మినహాయింపునిచ్చింది. రైతులు, కార్మికులు, వలస కార్మికులు ఇబ్బంది పడకుండా గైడ్ లైన్స్ రూపొందించింది. పరిశుభ్రత పాటించడం విషయంలో కఠిన నిబంధనలు విధించింది. ఆఖరికి ఉమ్మితే కూడా జరిమానా ఉంటుందని పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ పూర్తి నిబంధనలు :  

* ఏప్రిల్‌ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు, మండీలకు అనుమతి

* వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు వ్యక్తులకు అనుమతి నిరాకరణ

* అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి అనుమతి నిరాకరణ

* సినిమా హాళ్లు, షాపింగ్‌ మాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, ఈత కొలనులు, బార్లు మూసివేత

* విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు మూసివేత

* మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం

* ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, ఔషధ దుకాణాలు యథాతథం, ఔషధ పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాలు యథాతథం

* పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగును కొనసాగించవచ్చు.
* ఉపాధి హామీ పనులకు అనుమతి,

* అక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతి

* రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు అనుమతి

* వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు తెరిచేందుకు అనుమతి

* వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు అనుమతి

* విత్తనోత్పత్తి సహా ఎరువులు, పురుగుమందుల దుకాణాలకు అనుమతి

* బ్యాంకుల కార్యకాలాపాలు యథాతథం

* అనాథ, దివ్యాంగ, వృద్ధాశ్రమాల నిర్వహణకు అనుమతి

* రోడ్ల పక్కన దాబాలు, వాహన మరమ్మతుల దుకాణాలకు అనుమతి

* ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరలించేందుకు అనుమతి నిరాకరణ

* గోదాములు, శీతల గోదాములకు అనుమతి

* ఈ కామర్స్‌ సంస్థలు, వాహనాలకు అనుమతి

* వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి

* ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్‌మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవలకు అనుమతి

* గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతి

* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధింపు

* బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి

* భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు

* ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసులు యథాతథం

* ఐటీ సంస్థలు, ఐటీ సేవలకు 50శాతం సిబ్బందితో నిర్వహణకు అనుమతి