చిన్నారులు భలే చెప్పారు : ప్రధాని

దేశంలో కరోనా విజృంభిస్తోంది. దాన్నుంచి తప్పించుకోవడానికి సామాజిక దూరం, శుభ్రత, మాస్క్ లని ధరించాలని పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, ప్రజలు వీడియోల రూపంలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కరోనాపై చిన్నారులు చేసిన ఓ ప్రయోగాత్మక వీడియో ప్రధాని నరేంద్ర మోడీని ఆకర్షించింది. ఆ వీడియోని రీ ట్విట్ చేసిన ప్రధాని చిన్నారులు భలే చేశారని కితాబిచ్చారు.

ఆ వీడియోలో ముగ్గురు విద్యార్థులకు మరొక విద్యార్థి వైరస్‌ సంక్రమణ ఒకరినుంచి ఒకరికి ఎలా ఉంటుంది, దాన్ని ఎలా నియంత్రించగలం అనే విషయాన్ని ఇటుకల ద్వారా సోదాహరణంగా వివరిస్తాడు. ఇందులో భాగంగా ఇటుకలను నిలువుగా వలయాకారంలో పేర్చి ముందున్న ఇటుకను తోయగానే ఒకదానిపై ఒకటి పడి మొత్తం అన్ని బోర్లా పడతాయి. మరొక వలయాకారంలో ముందున్న ఇటుకును తోయగానే ఒకదానిపై ఒకటి పడుతున్న క్రమంలో మధ్యలో ఒక ఇటుకను తొలగిస్తాడు. దీంతో మిగతా ఇటుకలు అలాగే ఉంటాయి. దీని ప్రకారం వైరస్‌ ఒకరినుంచి ఒకరి సంక్రమిస్తున్నప్పుడు ప్రజలంతా భౌతికదూరం పాటిస్తే దాని వ్యాప్తిని అరికట్టవచ్చని వివరిస్తాడు.