భారత్ లో కరోనా కేసులు, మరణాలు ఎన్ని ?
భారత్ లో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ కొత్తగా వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 43 మంది మరణించగా మరో 991 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,378కి చేరింది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 480మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల్లో 1992 మంది కోలుకోగా ప్రస్తుతం మరో 11,906మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.
దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ ఇప్పటి వరకు 3323 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 200మందికిపైగా మృతి చెందారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత కొనసాగుతోంది. తెలంగాణలో 766పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 18మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ 572 కరోనా కేసులు నమోదయ్యాయి. 14మంది మృతి చెందారు.