నాని-విజయ్.. ఈ దర్శకుల పోటీ ఏంటీ ?

టాలీవుడ్ లో యంగ్ హీరోలు నాని, విజయ్ దేవరకొండల మధ్య పోటీ గమ్మత్తుగా ఉంది. వీరిద్దరు ఒకే దర్శకుడిని సెలక్ట్ చేసుకుంటున్నారు. ఆ దర్శకుడితో ఎవరు ముందు సినిమా చేస్తారా ? అనే ఉత్కంఠని కలిగిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణకు ఒకే సమయంలో నాని, విజయ్ ఓకే చెప్పేశారు. వీరిద్దరులో శివ నిర్వాణ ఎవరితో ముందు సినిమా చేస్తారానే చర్చ కొన్నాళ్లు సాగింది. ఫైనల్ గా నానితోనే శివ నిర్వాణ ముందుగా సినిమా మొదలెట్టాడు. వీరికాంబో టక్ జగదీష్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ సినిమా ఉండనుంది.

ఇప్పుడు కొరటాల శివ విషయంలో ఇదే రకమైన పోటీ నెలకొంది. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఓ యంగ్ హీరోతో సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే స్కిప్ట్ పనులు మొదలయ్యాయి. కొరటాల దృష్టిలో విజయ్, నాని ఇద్దరు ఉన్నారు. ఇద్దరితోనూ సినిమాలు చేయాలని భావిస్తున్నారు. అయితే ఇద్దరిలో ఎవరితో కొరటాల ముందుగా సినిమా చేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆచార్య సినిమా రిలీజ్ తర్వాత ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనన్యపాండే హీరోయిన్. విజయ్ నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా సినిమా ఇది. ఇక నాని టక్ జగదీష్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమా షూటింగ్స్ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడిన సంగతి తెలిసిందే.