వలస కూలీలకి కేంద్రం గుడ్ న్యూస్

లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను వారి స్వస్థలాలకు చేర్చడం కోసం లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్లో పలు మార్పులు చేసింది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల అధిపతులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఉత్తర్వులు జారీ చేశారు.

అన్ని రాష్ట్రాలు నోడల్‌ అధికారులను నియమించుకొని చిక్కుకుపోయిన వారి వివరాలు సేకరించాలని హోంశాఖ సూచించింది. తరలింపుపై ఇరు రాష్ట్రాలు పరస్పరం అంగీకరించాలని స్పష్టం చేసింది. అయితే తరలించే సమయంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. స్వస్థలాలకు చేరుకున్న తర్వాత అక్కడి స్థానిక అధికారులు మరోసారి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని.. ఆరోగ్యం బాగాలేని వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాల్సిందిగా స్పష్టం చేసింది.