తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కొద్దిరోజులుగా కరోనా తగ్గుముఖం పట్టినట్టు కనిపించింది. ప్రతిరోజు పదిలోపే కొత్త కేసులు నమోదవుతుండటం.. అవి కూడా జీహెచ్ ఎంసీ పరిధిలోనే కావడంతో తెలంగాణలో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్టు అనిపించింది. అతి త్వరలోనే కరోనా ఫ్రీ తెలంగాణని చూడబోతున్నామని ప్రజలు ఆనందపడ్డారు. ఇంతలో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో ఒక్కసారిగా కరోనా కొత్త కేసుల సంఖ్య పెరిగింది. గురువారం 22 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో ముగ్గురు మృతి చెందారు. ఇవన్నీ కూడా జీహెచ్ ఎంసీ పరిథిలోనే నమోదయ్యాయి.
 
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1038కి చేరింది. మృతుల సంఖ్య 28కి చేరింది. గురువారం 33 మంది కోలుకొని గాంధీ నుంచి ఇళ్లకెళ్లారు. ఒక్కసారిగా వైరస్ కేసుల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి, హైదరాబాద్ పరిధిలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో జీహెచ్ ఎంసీ మినహా మిగిలిన జిల్లాల్లో క్రమేణా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం 11 కరోనా రహిత జిల్లాలను ప్రకటించగా తాజాగా ఈ జాబితాలో సంగారెడ్డి, జగిత్యాల చేరాయి.