వారి స్పీడుకు భయపడిన రోహిత్
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిలబడితే సంగతి. సింగిల్స్ తీసినంత ఈజీగా సిక్సర్లు బాదేస్తాడు. సెంచరీ దాటమే లేటు.. అది కొద్దిసేపట్లో డబుల్ సెంచరీ గా మారుతుంది. వన్డేల్లో మూడు ద్విశతకాలు చేసిన ఒకేఒక్కడు..మన రోహిత్. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మెన్స్ లో ఒకడిగా వెలుగొందుతున్నాడు. రోహిత్ మైదానంలోకి వచ్చాడంటే.. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్. ఇప్పుడు కరోనా లాక్‌డౌన్ తో ఇంటికే పరిమితమైన రోహిత్ సోషల్ మీడియా వేదికగా వినోదాన్ని పంచుతున్నారు.
వరుసగా వీడియో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాడు. తాజా, మాజీ ఆటగాళ్లతో అనుభవాలని పంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు చెబుతున్నాడు. తాజాగా రోహిత్.. భారత పేసర్ మహమ్మద్ షమీతో ఇన్ స్టార్ గ్రామ్ లైవ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న ఇద్దరు కఠిన బౌలర్ల గురించి చెప్పాడు.
“నేను భారత జట్టులోకి వచ్చినప్పుడు బ్రెల్లీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్గా ఉన్నాడు. నా తొలి వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికాతో ఆడేందుకు ఐర్లాండ్కు వెళ్లా. స్టెయిన్ కూడా వేగంగా బంతులేస్తాడు. నా కెరీర్ తొలినాళ్లలో వారిని ఎదుర్కొనేందుకు చాలా ఇబ్బందులు పడ్డా. ప్రస్తుతం.. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ మంచిగా బౌలర్గా ఉన్నాడు. అలాగే ఆస్ట్రేలియా పేసర్ హాజిల్వుడ్ మంచి లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తున్నాడు” అని రోహిత్ చెప్పుకొచ్చాడు.