ఒకరి వల్ల 12మందికి కరోనా

మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుంది ? అనడానికి ఇదో చక్కని ఉదాహరణ. సరూర్ నగర్ లో ఉండే ఓ వృద్దుడి పెద్ద కుమారుడు నూనె వ్యాపారం చేస్తుంటాడు. సూర్యపేట పల్లీలుకొని.. వాటిని సరూర్ నగర్ లో నూనగా మార్చి.. మలక్ పేట్ గంజ్ లో విక్రయిస్తుంటాడు. ఇతనికి కరోనా వైరస్ సోకింది.

ఆ విషయం తెలియక.. కాస్త జ్వరం లక్షణాలు కనిపించడంతో వనస్థలి పురంలోని ఉంటున్న తన సోదరుడి ఇంటికి వెళ్లి.. స్థానికంగా చికిత్స తీసుకొని.. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి వెళ్లాడు. గాంధీలో ఇతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈలోపు ఇతడి తండ్రి బాత్ రూంలో జారిపడి కన్నుమూశాడు. చనిపోయిన తర్వాత చేసిన పరీక్షల్లో ఆయనకి కరోనా సోకిందని తేలింది. వనస్థలిపురంలో ఉండే ఇతడి రెండో కుమారుడు సైతం కరోనాతో మృతి చెందారు. వీరికి రక్త సంబంధం ఉన్న మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.

అంతేకాదు.. వీరి దుకాణంలో ప్రతిరోజూ 300మంది వరకు సరుకులు కొనుగోలు చేయడానికి వస్తుంటారు. ఇప్పుడు వారిని గుర్తించడం కష్టంగా మారింది. ఇప్పటికే 169మందిని గుర్తించారు. మలక్ పేట మార్కెట్ ని మూసేశారు. ఈ ఒక్క ఘటనతో వందకి పైగా కరోనా కేసులు నమోదయ్యేలా కనిపిస్తున్నాయి.