వలస కూలీలకి కాంగ్రెస్ బాసట

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. 40రోజుల లాక్‌డౌన్‌ తర్వాత వారిని స్వస్థలాకి వెళ్లేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. అయితే వీరి తరలింపు పెద్ద సమస్యగా మారింది. ప్రత్యేక రైళ్లు, బస్సులు వినియోగిస్తున్నారు. ఇందుకు అవుతున్న ఖర్చుని ప్రభుత్వమే భరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇంకో అడుగు ముందుకేసి వలస కూలీల తరలింపునకు అయ్యే ఖర్చుని తామే భరిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇది తాము వలస కూలీల కోసం సాయమని తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ లేఖని విడుదల చేశారు. 

”వలసకార్మికులు దేశాభివృద్ధిలో భాగస్వాములని అన్నారు. విదేశాల్లో చిక్కుకున్న స్వదేశీయులకు ఉచిత విమాన ప్రయాణాన్ని అందించడం తమ భాద్యతగా గుర్తించిన ప్రభుత్వం, వారికి ఆహారం, రవాణా కోసం రూ. వందకోట్లు వెచ్చించిందని విమర్శించారు. గుజరాత్‌లో ఒక్క ప్రజా కార్యక్రమం కోసం రైల్వే శాఖ రూ. 151 కోట్లు విరాళంగా ప్రకటించినపుడు, వలసకార్మికులను ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో ఉచిత రైలు ప్రయాణం ఎందుకు కల్పించడం లేదు” అని సోనియా ప్రశ్నించారు.