నాని మెగా ముచ్చట్లు విన్నారా ?

నేచురల్ స్టార్ నాని మెగా సీక్రెట్ చెప్పడం మొదలెట్టాడు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగు సినిమా ఆణిముత్యాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా విడుదలై నేటితో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నాని వాయిస్ ఓవర్ తో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలని చెప్పించారు. తాజాగా నాని చెప్పిన మెగా ముచ్చట్ల వీడియో వచ్చేసింది. ఇంతకీ నాని ఏం చెప్పారంటే.. ?

బ్లాక్ బస్టర్లు ఎన్నో వస్తాయి. కానీ, జనరేషన్లు మారినా, ఎవర్ గ్రీన్ గా ఉండే బ్లాక్ బస్టర్ల లిస్ట్ లో ఫస్ట్ ఉండే సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. సినిమా తీసే, సినిమా చూసే విధానాన్ని మార్చిన ఈ చిత్రం ఎలా పుట్టింది? అశ్వినీదత్ గారికి ఏనాటి నుంచో ఎన్టీఆర్ ‘జగదేక వీరుని కథ’ లాంటి ఫాంటసీ సినిమా చిరంజీవిగారితో చేయాలని, అది తను ప్రేమగా ‘బావ’ అని పిలుచుకునే రాఘవేంద్రరావుగారు మాత్రమే తీయగలరని గట్టి నమ్మకం ఉండేదట.

ఆఖరి పోరాటం’ తరువాత చిరంజీవిగారితో సినిమా చేయాలనుకున్నారు దత్తుగారు. ఆయనకు క్లోజ్ ఫ్రెండ్, కో-డైరెక్టర్ అయిన శ్రీనివాస్ చక్రవర్తిని, రాఘవేంద్రరావుతో కలిపి తిరుపతికి పంపారు. సరిగ్గా తిరుమల కొండపై ఉండగా, దత్తుగారి మనసు తెలిసిన శ్రీనివాస చక్రవర్తి, “దేవకన్య భూమిపైకి వచ్చినప్పుడు ఆమె ఉంగరం పోతుంది. అది చిరంజీవిగారికి దొరుకుతుంది” అని ఊహామాత్రంగా చెప్పారు. అది రాఘవేంద్రరావుగారికి బాగా నచ్చింది. దత్తుగారి కలకు దగ్గరగా ఉంది. ఆయనకీ నచ్చింది. మరి జగదేకవీరుడికి అతిలోక సుందరిగా జోడీ ఎవరు? అందరి మదిలో మెదిలిన పేరు ఒక్కటే. వైజయంతీ ఆస్థాన నాయిక వెండితెర దేవత శ్రీదేవి. క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది.

దానికి తగిన కథను సిద్ధం చేయటానికి వైజయంతీ ఆఫీస్ లో రచయితల కుంభమేళా ప్రారంభమైంది. యండమూరి వీరేంద్రనాథ్ గారు, జంధ్యాలగారితో మొదలై, సత్యమూర్తిగారు, విజయేంద్ర ప్రసాద్ గారు, తమిళ రచయిత క్రేజీ మోహన్ గారు.. ఇలా ఇంతమంది రచయితల సైన్యం సిద్ధమైంది. అంతేకాదు, చిరంజీవిగారు కూడా నెలరోజుల పాటు అక్కడకు వెళ్లి కథా చర్చల్లో పాల్గొని తన సలహాలు కూడా ఇచ్చేవారు. దేవకన్యను అతిలోక సుందరిగా చూపిస్తున్నప్పుడు నేను కొంచెం మాసిన గడ్డంతో సామాన్య మానవుడి లుక్ లో ఉంటేనే బాగుంటుంది. అందరూ కనెక్ట్ అవుతారు అని చిరంజీవిగారు సలహా ఇచ్చారు.

మరోవైపు బాంబేలో తన కాస్ట్యూమ్స్ తానే కుట్టించుకోవడం మొదలు పెట్టారు శ్రీదేవిగారు. ఇలా అందరూ కలిసి తమ సమష్టి కృషితో ఈ అందమైన చందమామ కథను తెలుగు సినీ చరిత్రలో మర్చిపోలేని అద్భుత చిత్ర కావ్యంగా మలిచారు. చరిత్రను సృష్టించిన ఈ సినిమా అంత ఈజీగా అయిపోయిందనుకుంటున్నారా? లేదు మానవా! చాలా జరిగింది” అని నాని  చెప్పుకొచ్చాడు.