లాక్‌డౌన్ ముగిసినట్టేనా ?
కరోనా కట్టడి కోసం దేశంలో మార్చి 25 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఒకటి, రెండో విడత లాక్‌డౌన్ లని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేశాయి. మూడో విడత లాక్‌డౌన్ లో మాత్రం మినహాయింపులు ఇచ్చింది. ఈ నెల 17తో మూడో విడత లాక్‌డౌన్ కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3గంటలకి ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ పొడగింపు, ఆర్థిక అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా కుదేలైన పరిస్థితుల్లో ఎవరూ లాక్ డౌన్ కొనసాగించడానికి సుముఖత చూపడంలేదు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి అన్న నినాదాన్ని రాష్ట్రాలు అందుకున్నాయి. ఆంక్షల్ని ఒకేసారి ఎత్తివేయకుండా ఎలాంటి సడలింపులతో ముందుకు వెళ్లాలన్న అంశంపై ఈ సమావేశం ద్వారా ఒక స్థూల అభిప్రాయానికి రావొచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు ఒకటి, రెండో విడత లాక్ డౌన్ సమయాల్లో మరింత కాలం లాక్ డౌన్ పొడగించాలని ప్రజాభిప్రాయం వెల్లడయింది. అయితే ఇప్పుడు ప్రజల స్వరం కూడా మారింది. ప్రస్తుతం #LockdownEnd యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఈ యాష్ ట్యాగ్ తో లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకి సంబంధించిన ఫోటోలు, వీడియోలని షేర్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ని పొడగించాలనే అభిప్రాయంతో ఏమీ లేదు. ఈ సారి ప్రధాని నరేంద్ర మోడీ కరోనాతో కలిసి జీవించడం అనే నినాదాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే కొన్ని విద్యాసంస్థలు, థియేటర్స్, సభలు, సమావేశాల విషయంలో మాత్రం ఆంక్షలు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
#LockdownEnd