ఈసారి  ఖైరతాబాద్‌ గణేశుడు ఒక్క అడుగు మాత్రమే !

ఖైరతాబాద్ మహాగణపతిపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సారి కేవలం ఒక్క అడుగు ఎత్తు ఉండే గణేశుడి ప్రతిమను ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఖైరతాబాద్‌ భారీ వినాయకుడికి హైదరాబాద్‌ నగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహం ఎత్తు, రూపంలోనే కాకుండా.. ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకూ భారీ సంఖ్యలో భక్తుల కోలాహలంతో ఇక్కడ ప్రతి రోజూ ఎంతో సందడిగా ఉంటుంది.

వాస్తవానికి ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు యేడాదికో అడుగు తగ్గించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. గత యేడాది 61 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సారి ఓ అడుగు తగ్గించి 60 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఏకంగా 60 అడుగులు తగ్గించి.. ఒక్క అడుగు ప్రతిమని రెడీ చేయనున్నారు.