ఎల్జీ పాలిమర్స్ పై జగన్ సర్కార్ యాక్షన్

విశాఖ గ్యాస్ లీక్ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకి గురిచేసింది. ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టరైన్ లీక్ అవ్వడం వలన 12 మంది మృతి చెందారు. వందల మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటనలో చనిపోయిన వారికి సీఎం జగన్ సర్కార్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకి రూ.కోటి పరిహారం చెల్లించింది. గ్యాస్ లీక్ ప్రభావం ఉన్న గ్రామాల్లో ప్రతి వ్యక్తికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించింది.

తాజాగా ఎల్జీ పాలిమర్స్ పై కూడా యాక్షన్ మొదలెట్టింది. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో ఉన్న రసాయనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స త్సత్యనారాయణ తెలిపారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యాస్‌ లీక్‌ ప్రభావిత గ్రామాల్లో వాలంటీర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారన్నారు. ఐదు గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యం కోసం ఐదు మెడికల్‌ టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

గ్యాస్‌ లీక్‌ బాధిత గ్రామాల్లో ప్రతి వ్యక్తికి రూ.10వేలు నష్టపరిహారం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. మరికొన్ని గ్రామాలను కూడా బాధిత గ్రామాల్లో చేర్చాలని అడుగుతున్నారని.. వాటిని పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం బాధిత గ్రామాలకు మంచి నీటిని అందిస్తున్నామని, ఆయా గ్రామాల్లోని ప్రజలు యథావిధిగా తమ పనులు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.