నర్సులకు పవన్ శుభాకాంక్షలు

‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ నేడు. ఈ సందర్భంగా పలువురు నర్సులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి సేవలని కొనియాడుతున్నారు. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నర్సులకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో నర్సుల పనితీరు, వారి గొప్పదనం, కరోనా విజృంభిస్తున్న కఠన సమయాన వారి సేవలు అభినందనీయమని కొనియాడారు.

“కరుణతో రోగులను సంరక్షిస్తున్న గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ప్రతి నర్సుకి నా తరఫున, జనసేన తరఫున అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు. వృత్తి రీత్యా నర్సు అయినా అస్పత్రిలో వినిపించేది సిస్టర్ అనే మాటే. ఆ పిలుపుతోనే తమ కుటుంబ సభ్యులకు చేసే సేవగా భావించి సపర్యలు చేస్తారు.  కరోనా మహమ్మారి విజృంభించిన ఈ విపత్కర సమయంలో ఆసుపత్రుల్లో, ఐసోలేషన్ వార్డుల్లో నర్సులు సాహసంతో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఫ్లోరెన్స్ నైటింగెల్ వారసత్వాన్ని కరోనా సమయంలో నర్సులు కొనసాగిస్తున్న తీరు సర్వదా ప్రశంసనీయం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో నర్సింగ్ విభాగం చాలా అవసరం. సమర్థమైన నర్సులు మరింత మంది రావాలనే విషయాన్ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వృత్తిలో ఉన్నవారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ, గౌరవప్రదమైన వేతనాలు అందించేలా ప్రభుత్వాలు దృష్టి సారించాలి” అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.