వారికి సల్మాన్ వార్నింగ్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు చెందిన సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ నిర్మాణ సంస్థ ఓ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసుకుంటోందని సోషల్‌మీడియాలో కొంతకాలం నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఎస్‌కేఎఫ్‌ పేరుతో ఆడిషన్స్‌ కోసం రమ్మని పలువురికి మెస్సేజ్‌లు కూడా వెళ్లాయి. ఈ విషయం కాస్తా సల్మాన్‌ఖాన్‌ దృష్టికి వెళ్లడంతో..  తాజాగా ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. తన పేరు, తన నిర్మాణ సంస్థ పేరుని అనధికారికంగా వాడుకున్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను, నా ఫిల్మ్స్‌ సంస్థ ఏ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసుకోవడం లేదు. భవిష్యత్‌లో తెరకెక్కించబోయే చిత్రాల కోసం మేము ఎలాంటి క్యాస్టింగ్‌ ఏజెంట్లను నియమించలేదు. సినిమాల్లో అవకాశం కల్పిస్తామని మా నిర్మాణ సంస్థ పేరుతో ఎవరైనా మీకు మెస్సేజ్‌లు కానీ, మెయిల్స్‌ కానీ చేస్తే దయచేసి వాటిని నమ్మకండి. నా పేరుని కానీ నా సంస్థ పేరుని కానీ అనధికారికంగా వాడుకున్నట్లు అయితే సదరు వ్యక్తిపై తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం’ అని సల్మాన్‌ రాసుకొచ్చారు.

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం సల్మాన్ తన ఫాం హౌస్ లోనే గడుపుతున్నారు. అక్కడ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి పాటలని షూట్ చేస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ నుంచి రెండు పాటలొచ్చాయ్. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనా ప్రభావంతో షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయినా.. సోషల్ మీడియా వేదికగా అభిమానులని అలరిస్తూనే ఉన్నారు సల్మాన్ భాయ్.